మే 10 వ తేదీ — స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరి జన్మదినోత్సవము

మే 10 వ తేదీ — స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరి జన్మదినోత్సవము

ఆర్.బి.ఎం హైదరాబాద్: స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరి గారు భారతదేశపు విశిష్టమైన ఆధ్యాత్మిక గురువు; మరియు ప్రశస్తి పొందిన ఆధ్యాత్మిక గ్రంధరాజం, ఒక యోగి ఆత్మకథ రచయిత అయిన శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారికి గురువు. స్వామి శ్రీయుక్తేశ్వర్ గారు 1855 వ సంవత్సరం, మే 10 న బెంగాలులో జన్మించారు. ప్రియనాథ్ కరార్ గా జీవితం ప్రారంభించిన ఆయన నిస్సందేహంగా ఒక సమున్నతమైన ఆధ్యాత్మిక శిఖరానికి చేరుకున్నారు. తమ పరమ గురువులైన శ్రీ మహావతార్ బాబాజీ ఆదేశాన్ననుసరించి ఆయన రచించిన ది హోలీ సైన్స్ సర్వకాలీనమైన ఆధ్యాత్మిక ప్రామాణిక గ్రంథం. దీనిలో అందరికీ అర్థమయ్యేలా లోతైన ఆధ్యాత్మిక సత్యాలు సంగ్రహంగాను, స్పష్టం గాను పొందుపరిచారు.

తన ప్రధాన శిష్యుడైన యోగానందగారికి స్వామి శ్రీయుక్తేశ్వర్ గారు అందించిన శిక్షణ ఖచ్చితమైనదీ, తీవ్రమైనదీ అయినా అన్ని రకాలుగా పరిపూర్ణమైనది. ఆ విధంగా ఆయన తన శిష్యుడు — భారతదేశం మరియు ప్రపంచంలోని సాధారణ ప్రజానీకానికి క్రియాయోగాన్ని గురించిన జ్ఞానాన్ని అందించడంలో — అందుకోలేని ఉన్నత శిఖరాలకు చేరడానికి తోడ్పడ్డారు. “మానవ పరిణామాన్ని వేగవంతం చేసే ఉపకరణం క్రియాయోగం” అని శ్రీయుక్తేశ్వర్ గారు అన్నారు. ఈ క్రియాయోగం శరీరము, మనస్సు, ఆత్మ యొక్క పరిశుద్ధతను సాధించడంలో మానవులకు తోడ్పడి, అంతిమంగా శ్రద్ధాళువైన సాధకుడు భగవంతునితో ఏకత్వాన్ని కనుగొనే సామర్థ్యతను ప్రసాదించే ఖచ్ఛితమైన విజ్ఞానం.

స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరి ఆదేశానుసారం యోగానందగారు పశ్చిమ దేశాలకు క్రియాయోగాన్ని పరిచయం చేశారు. క్రియాయోగాన్ని గురించిన జ్ఞానాన్ని ప్రామాణీకముగా వ్యాప్తి చెందించడానికి సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ మరియు యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా లను స్థాపించమని ఆయనకు స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరి సూచించారు. మానవజాతికి యోగాన్ని నేర్పించే ప్రయత్నంలో యోగానందగారు వేసిన మొదటి అడుగులకు శ్రీయుక్తేశ్వర్ గారి మార్గదర్శనమే కారణం మరియు చివరకి ఈ ప్రయత్నంలో ఆయన తేజస్సు ఖండాంతరాలకు వ్యాపించి ఆయనను ఒక ఆధ్యాత్మిక మేరువుగా నిలబెట్టింది.

తన ప్రియ శిష్యుడైన యోగానందగారితో శ్రీయుక్తేశ్వర్ గారి మొదటి సమాగమం నాటకీయంగానూ స్ఫూర్తి దాయకంగానూ ఉంటుంది. కాశీ లోని ఒక చిన్న సందు మొదట్లో నిలిచి ఉన్న ఒక పొడవాటి, గంభీరాకృతి వైపు తాను అయస్కాంతం వలే ఆకర్షింపబడటం గమనించిన యోగానందగారు — అప్పటికాయన కిశోర ప్రాయంలో ఉన్న యువకుడు — ఆ సాధువును గత జన్మల నుండి ఉంటూ వస్తున్న తన గురువుగా గుర్తించారు. ఇక ఆ మహా గురువు పలికిన మొదటి మాట “నా తండ్రీ, వచ్చేశావా !” కాలంతో సంబంధంలేని గురుశిష్యుల అనుబంధాన్ని ఒక యోగి ఆత్మకథ లో పొందుపరచిన ఈ మాట వెల్లడి చేస్తుంది.

గురుదేవులు అతి జాగ్రత్తగా అందించిన శిక్షణతో యోగానందగారు తన వ్యక్తిత్వాన్ని సానబెట్టిన తీరు ఆయనను ఈ లోకంలోనూ దానికి అవతలా కూడా గొప్పవానిగా నిలబెట్టింది. యోగానందగారిని అత్యున్నత ఆధ్యాత్మిక శిఖరాలకు చేర్చడానికి ఆయనను తీర్చిదిద్దిన తీరులోనే శ్రీయుక్తేశ్వర్ గారి వారసత్వ గొప్పదనం నిజంగా వెల్లడి అవుతుంది.

సరళత యొక్క శక్తిని తరచుగా మానవులు—కృషి అవసరమైన వివిధ రంగాలలో శ్రేష్ఠత కొరకు పాటుపడేవారు —తక్కువగా అంచనా వేస్తారు. కాని భారతీయ ఋషులకు శ్రేష్ఠత యొక్క ఉత్తమ గుణాలు తెలుసు. మరియు సరళమైన విధాలలో వాటికి దృష్టాంతంగా నిలిచారు. శ్రీయుక్తేశ్వర్ గారి జీవితం ఆదర్శవంతమైన జీవనానికి ఒక దృష్టాంతము. పథ నిర్దేశక మహత్వపూర్ణ రచన అయిన వారి హోలీ సైన్స్ యుగయుగాలకూ అద్భుతంగా నిలుస్తుంది. అయినప్పటికీ, స్వామి శ్రీయుక్తేశ్వర్ గారి జీవితకాలంలోని అత్యధిక భాగం విస్తృతమైన, బృహత్కార్యాలలో కాకుండా శిష్యుల యొక్క క్షుణ్ణమైన ప్రాథమిక శిక్షణలో గడిచింది.

సమున్నతమై, లోతుగా వేళ్ళూనిన భారతదేశపు ఆధ్యాత్మిక బోధనలకు మార్గనిర్దేశకునిగా ఉండే విధంగా యోగానందగారికి అత్యంత విజ్ఞతతో శిక్షణనిచ్చారు. అలాగే, ఈ సాటిలేని సత్యాలలోని బయటికి కనిపించే చిక్కుముడుల వెనుక దాగిన సరళత్వాన్ని యోగానందగారు సమర్థవంతంగా పాశ్చాత్య దేశాలకు, మిగతా ప్రపంచానికి చాటిచెప్పారు.

భారతదేశపు మహోత్కృష్ట ఆధ్యాత్మిక దూతల్లో ఒకరైన పరమహంస యోగానందగారి గురువు, స్నేహితుడు, మార్గదర్శకునిగా స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరి ఒక ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి దారి సుగమం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సత్యాన్వేషకుల హృదయాలు, మనస్సులు, ఆత్మలను అది నెమ్మదిగా పరివేష్టించే క్రమంలో ఉంది. మరింత సమాచారం కోసం: yssofindia.org

Leave a Reply

Your email address will not be published.